India: ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు.. జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించిన కేంద్రం!
- ఢిల్లీలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్
- హాజరైన వేర్వేరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
- ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జర్లపై పన్ను తగ్గింపు
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి ఈరోజు ఢిల్లీలో సమావేశమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేలా ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి, వాటి చార్జర్లపై విధిస్తున్న జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
ఈ రేట్లు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బస్సులను అద్దెకు తీసుకుంటే వాటిపై కూడా జీఎస్టీని మినహాయించాలని ఈ భేటీలో తీర్మానించినట్లు చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గత గురువారమే జరగాల్సినప్పటికీ నిర్మలా సీతారామన్ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనాల్సి రావడంతో ఈ భేటీ వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కావడం ఇదే తొలిసారి.