Telugudesam: బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు వ్యతిరేకమా?: మంత్రి ఆదిమూలపు సురేశ్
- అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు చారిత్రాత్మకం
- వీటిపై చర్చలో పాల్గొనలేదంటే బాబు వ్యతిరేకించినట్టేగా
- కులాల మధ్య చిచ్చుపెట్టే తత్వం చంద్రబాబుది
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బడుగు, బలహీనవర్గాలకు చేయూతనిచ్చే బిల్లులను అసెంబ్లీలో ఆమోదించామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, పాలక మండళ్లు, నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. బడుగు, బలహీన వర్గాలకు బాబు వ్యతిరేకమా? ఆయన హయాంలో ఎప్పుడైనా ఇలాంటి చట్టాలు చేశారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు చారిత్రాత్మకమని, ఈ బిల్లులను ప్రవేశ పెడుతుంటే అసెంబ్లీ నుంచి బాబు పారిపోయారని విమర్శించారు.
చారిత్రాత్మక బిల్లులపై చర్చలో పాల్గొనలేదంటే వాటిని బాబు వ్యతిరేకించినట్టేనని వ్యాఖ్యానించారు. మద్య నిషేధానికి చంద్రబాబు వ్యతిరేకమా? 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం టీడీపీకి ఇష్టం లేదా? జవాబు చెప్పాలి? అని అన్నారు. కౌలు రైతులను ఆదుకునే విధంగా చట్టం తెస్తే చంద్రబాబు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే తత్వం చంద్రబాబుది అని, బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంక్ గానే చూశారని ఆరోపించారు. పాఠశాల విద్యా చట్టం, ఉన్నత విద్యా చట్టంతో విద్యా వ్యవస్థలో మార్పులకు నాంది పలుకుతామని పేర్కొన్నారు.