Bihar: రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా ఆకాశం నుంచి దూసుకొచ్చిన ఉల్క!
- బీహార్ లో ఘటన
- ఉల్క కారణంగా పొలంలో నాలుగు అడుగుల గొయ్యి
- మ్యూజియంలో ఉల్కను పరిశీలించిన సీఎం నితీశ్ కుమార్
అప్పుడప్పుడు ఆకాశంలో ఉల్కలు, తోకచుక్కలు దర్శనమిస్తుంటాయి. వాటిలో చాలావరకు భూవాతావరణంలో ప్రవేశించగానే మండిపోతుంటాయి. తాజాగా, బీహార్ లో ఓ పెద్ద రాయి సైజులో ఉన్న ఉల్క ఓ పొలంలో పడింది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా, పెద్ద శబ్దంతో ఓ రాయి దూసుకొచ్చింది. దీని కారణంగా ఓ రైతుకు చెందిన పొలంలో 4 అడుగుల గొయ్యి ఏర్పడిందంటే ఉల్క ఎంత వేగంగా దూసుకొచ్చిందో అంచనా వేయొచ్చు.
ఈ ఉల్క కారణంగా రైతులు భీతిల్లిపోయారు. పొలంలో పడిన గోతి నుంచి ఆ రాయిని వెలికితీసిన గ్రామస్తులు దానికి అయస్కాంత శక్తి ఉండడం గమనించి ఆశ్చర్యపోయారు. దీని బరువు 15 కిలోలు ఉంది. కొందరు దానికి దైవశక్తిని ఆపాదించి పూజలు కూడా నిర్వహించారు. అనంతరం స్థానిక అధికారులు దాన్ని శాస్త్రవేత్తలకు అందించగా, వారు దాంట్లో ఉల్క లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఇది పాట్నాలోని మ్యూజియంలో కొలువుదీరి ఉంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఈ రాయిని పరిశీలించి ఆశ్చర్యపోయారు.