Botsa Satyanarayana: రాజధాని భూముల్లో కుంభకోణం జరిగింది: బొత్స
- రైతులను మోసం చేశారంటూ మంత్రి ఆరోపణ
- రాజధానిలో 25 శాతం పనులపైనే విచారణ జరుగుతోందంటూ స్పష్టీకరణ
- నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయమని కితాబు
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని భూముల్లో కుంభకోణం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. సన్న, చిన్నకారు రైతులను మోసం చేసి పెద్దలు దోచుకున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాజధానిలో 25 శాతం పనులపైనే విచారణ చేస్తున్నామని, మిగతా పనులను నిలిపివేయాలని ప్రభుత్వం చెప్పలేదని బొత్స స్పష్టం చేశారు. ఇప్పుడు తాము మంచిపనులు చేస్తుంటే మద్దతు ఇవ్వకుండా సభ నుంచి పారిపోయారంటూ చంద్రబాబును విమర్శించారు.
ఇక, వార్డు, గ్రామ సచివాలయ నియామకాల నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడారు. ప్రజలకు పాలన చేరువ చేయాలనే వార్డు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీచేశామని, ఒక్కో వార్డు సచివాలయానికి 10 మంది ఉద్యోగులు ఉంటారని, వారు ఒక్కో విభాగానికి ఒక్కొక్కరు కార్యదర్శిగా వ్యవహరిస్తారని వివరించారు. వారిలో ఒకరిని అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శిగా నియమిస్తామని తెలిపారు. అక్టోబరు 2 నుంచి స్థానిక సచివాలయాలు కార్యకలాపాలు కొనసాగిస్తాయని వెల్లడించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ల అమలు చారిత్రక నిర్ణయం అని బొత్స పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వ్యతిరేకి అని విమర్శించారు.