Mekathoti Sucharitha: ఇది గ్రామ సమస్య... టీడీపీ నేతలు రాజకీయం చేయడం తగదు: హోంమంత్రి సుచరిత
- పొనుగుపాడు వివాదంపై మంత్రి స్పందన
- రెండు వర్గాల మధ్య ఐదేళ్లుగా వివాదం ఉందని వివరణ
- సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ప్రయత్నిస్తున్నారన్న మంత్రి
గుంటూరు జిల్లా పొనుగుపాడులో ఉద్రిక్తతలపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ఇది గ్రామ సమస్య అని, గత ఐదేళ్లుగా రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. చర్చికి సంబంధించిన స్థలంలో గోడ కడుతుంటే కొందరు వ్యక్తులు అడ్డుకోవడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ప్రయత్నిస్తున్న తరుణంలో టీడీపీ నేతలు రాజకీయం చేయాలని చూడడం తగదని హితవు పలికారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయనాయకులు గ్రామంలోకి వెళితే కులాల పేరిట గొడవలు తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్య రాకూడదనే గ్రామంలో ముందుగానే పోలీసులు చర్యలకు ఉపక్రమించారని హోంమంత్రి పేర్కొన్నారు. పొనుగుపాడు గ్రామంలోకి వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని భావించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, హోంమంత్రి సుచరిత పైవ్యాఖ్యలు చేశారు.