Telangana: ఐఏఎస్ అధికారి మురళి రాజీనామా.. పనిలేకపోవడంతోనే తప్పుకుంటున్నట్లు వెల్లడి!
- దళితులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
- గతంలో వివాదాస్పదంగా మారిన మురళి వ్యాఖ్యలు
- రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ గా నియమించిన ప్రభుత్వం
తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంకా సర్వీసు ఉన్నప్పటికీ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్ ఎస్కే జోషికి సమర్పించారు. చేసేందుకు పనిలేకపోవడంతోనే తాను సర్వీసుకు వీఆర్ఎస్ సమర్పించినట్లు మురళి మీడియాకు తెలిపారు. తన అనుభవం గురించి తెలిసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టును ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని సామాజికవర్గాల ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇస్తున్నారని మురళి ఆరోపించారు. తన నాలెడ్జ్, కమిట్‌మెంట్ ప్రభుత్వానికి అవసరం లేదేమోనని అభిప్రాయపడ్డారు. తన 35 ఏళ్ల సర్వీసులో ఇంత ఖాళీగా కూర్చునే ఉద్యోగాన్ని ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు. విద్యారంగంలోని సమస్యలపై తాను పోరాడుతానని చెప్పారు.
మురళీ గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో గిరిజనులు, ఆదివాసీలు ఆరోగ్యంగా ఉండేందుకు గొడ్డు మాంసం, పంది మాంసం తినాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై బ్రాహ్మణ సామాజికవర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయనపై బదిలీ వేటు పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పురావస్తు (ఆర్కైవ్స్) శాఖ డైరెక్టర్ గా మురళీని ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన తాజాగా వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు.