Guntur District: నాన్నా చనిపోతున్నా...ఉపాధి కోసం మలేషియా వెళ్లిన ఓ యువకుడి ఆవేదన
- ఆపదలో చిక్కుకుని జైలు పాలు
- రెండు నెలులుగా జైల్లోనే నరకయాతన
- తనను రక్షించాలని తల్లిదండ్రులకు వేడుకోలు
ఉపాధి వెతుక్కుంటూ మలేషియా వెళ్లిన ఓ యువకుడు అనుకోకుండా జైలుపాయ్యాడు. రెండు నెలలుగా జైలులో నరకయాతన అనుభవిస్తూ ఇలాగే కొన్నాళ్లు ఉంటే చనిపోతానంటూ తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లిదండ్రులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డను రక్షించాలంటూ గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీని వేడుకున్నారు. బాధిత కుటుంబం కథనం మేరకు....పిడుగురాళ్లకు చెందిన గురూజీ ఆటో నడుపుతూ జీవోనోపాధి పొందుతున్నాడు. ఇతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు నరసింహారావు గత ఏడాది పదో తరగతి పూర్తిచేసి కంప్యూటర్ శిక్షణ పొందాడు. ఆ క్రమంలో మలేషియా వెళ్లి వచ్చిన అదే ప్రాంతానికి చెందిన సైదారావుతో నరసింహారావుకు పరిచయం ఏర్పడింది. తనతో పాటు మలేషియా వస్తే రూ.35 వేల కొలువు ఇప్పిస్తానని నమ్మించి వీసా ఖర్చుల కింద రూ.లక్ష తీసుకున్నాడు. ఐదు నెలల క్రితం నరసింహారావుకు వీసా పంపి మలేషియా రప్పించాడు.
కొన్నాళ్లపాటు నరసింహారావు రోజూ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడేవాడు. ఇక్కడ ఓ కంపెనీలో ప్యాకేజీ ఉద్యోగమని, ఇబ్బందిగానే ఉందని వాపోయేవాడు. మలేషియా రావడానికి అయిన ఖర్చుతోపాటు, ప్రయాణానికి అయిన ఖర్చయినా సంపాదించాక తిరిగి వచ్చేస్తానని తల్లిదండ్రులతో చెప్పేవాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు నరసింహారావు నుంచి ఫోన్ కూడా లేదు. రెండు నెలల నుంచి కొడుకు నుంచి ఫోన్ రాకపోవడం, తాము చేస్తే స్విచ్ఛాఫ్ అని రావడంతో ఆందోళన చెందిన గురూజీ విషయం సైదారావుకు ఫోన్లో చెప్పారు.
తాను వేరే ప్రాంతంలో ఉన్నానని, కనుక్కుని చెబుతానని చెప్పినా సమాచారం ఇవ్వలేదు. దీంతో నాలుగు రోజుల క్రితం పిడుగురాళ్ల వచ్చిన సైదారావును గురూజీ నిలదీశాడు. దీంతో నరసింహారావు రెండు రోజుల్లో వచ్చేస్తాడని నమ్మబలికాడు. ఈలోగా నరసింహారావు లేఖ రాసి హైదరాబాద్లో ఉన్న తెలిసిన వారికి వాట్సాప్కు పెట్టాడు. వారు తెలియజేసిన వివరాలతో గురూజీ కుటుంబం కుప్పకూలిపోయింది.
రెండు నెలల నుంచి తాను జైల్లో ఉన్నానని, శరీరం అంతా పుండుగా మారిందని, రోజూ జ్వరం వస్తున్నా కనీసం మందు బిళ్ల కూడా ఇవ్వడం లేదని, ఇలాగే ఉంటే కొన్ని రోజుల్లోనే చనిపోతానని ఆ లేఖలో నరసింహారావు వాపోయాడు. లేఖ చదివిన తల్లిదండ్రులు కొడుకు పరిస్థితిపై ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. వారు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.