Narendra Modi: వెనుకబడ్డా ముందుకు దూకే సత్తా మనది: నరేంద్ర మోదీ
- ఏర్పడిన అవరోధాలు తాత్కాలికమే అయ్యాయి
- రికార్డు సమయంలో తప్పులను సరిదిద్దారు
- చంద్రయాన్-2పై మన్ కీ బాత్ లో నరేంద్ర మోదీ
ఏదైనా ఓ విషయంలో వెనుకబడినా, ఆపై రెట్టించిన వేగం, ఉత్సాహంతో ముందుకు దూకే సత్తా భారతీయులకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 'మన్ కీ బాత్'లో భాగంగా ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, చంద్రయాన్-2 ఎన్నో రకాలుగా ఇండియాకు ప్రత్యేకమైన మిషన్ అని అభివర్ణించారు. భారత శాస్త్రవేత్తలకు తమ సత్తాపై ఉన్న నమ్మకం, ధైర్యం, చంద్రయాన్-2 మిషన్ ను వారంలోనే తిరిగి పట్టాలెక్కించేలా చేసిందని కొనియాడారు.
ఈ మిషన్ కు ఏర్పడిన అవరోధాలు తాత్కాలికమే అయ్యాయని అన్నారు. చంద్రుడిని గురించి మరింతగా అర్థం చేసుకునేందుకు చంద్రయాన్-2 ఉపకరిస్తుందన్నారు. జరిగిన సాంకేతిక తప్పులను రికార్డు సమయంలో శాస్త్రవేత్తలు పరిష్కరించారని, ఇందుకు మనమంతా గర్వపడాలని అన్నారు. దేశంలోని కోట్లాది మంది యువతను ఈ మిషన్ శాస్త్ర సాంకేతిక రంగాల దిశగా వారు అడుగులు వేసేందుకు ప్రోత్సహిస్తుందని భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.