Andhra Pradesh: ఇది హైటెక్ మోసం.. టెక్నాలజీతో జగన్ పీఏగా చెలామణి.. పలువురు నేతలకు యువకుల టోకరా!
- విశాఖ కేంద్రంగా యువకుల ముఠా
- స్ఫూఫింగ్ టెక్నాలజీతో జగన్ పీఏగా ఫోన్
- వైసీపీ టికెట్ ఇస్తామని భారీగా వసూళ్లు
టెక్నాలజీ రెండువైపుల పదునున్న కత్తిలాంటిదని నిపుణులు చెబుతుంటారు. అందుకు ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. విశాఖపట్నం జిల్లాకు చెందిన పండరి విష్ణుమూర్తి, గంధవరపు తరుణ్, ఎం.జగదీష్, పి.జయకృష్ణకు సాంకేతికతపై పట్టుంది. దీంతో వీరంతా తొలుత ఎలాగోలా వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ పీఏ నంబర్ తెలుసుకున్నారు. అనంతరం స్ఫూఫింగ్ టెక్నాలజీ సాయంతో ఈ నంబర్ ను ఫీడ్ చేసి పలువురు ఉత్తరాంధ్ర రాజకీయ నేతలకు కాల్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇస్తామని బేరసారాలు ఆడారు. దీంతో వీరి ట్రాప్ లో పడ్డ పలువురు నేతలు లక్షల రూపాయల నగదును ముట్టజెప్పారు.
అయితే ఇంకొందరు నేతలు ఈ తతంగంపై అనుమానం వచ్చి కాల్ కట్ చేసి నేరుగా జగన్ కార్యదర్శికి ఫోన్ చేశారు. దీంతో తాను ఎవ్వరికీ ఫోన్లు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత నేతలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఈ మోసంపై వైసీపీ సంయుక్త కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మరో కేసులో రాజమండ్రి పీఎస్ లో ఉన్న ఈ నలుగురు నిందితులను పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. వీరిపై ఇప్పటికే పలు సైబర్ నేరాల కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరతామన్నారు.