shivaji: త్వరలో జాతీయ పార్టీలోకి శివాజీ.. ప్రత్యర్థులకు త్రీడీ సినిమా చూపిస్తానని హెచ్చరిక
- రెడ్లకు, రావులకు భయపడే రకం కాదు నేను
- రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండడం వల్లే టార్గెట్ అయ్యా
- బీజేపీలో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది
సినీ నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశిస్తున్నట్టు తెలిపారు. అన్ని పార్టీల్లోనూ తనకు శ్రేయోభిలాషులు ఉన్నారన్న ఆయన త్వరలోనే ఓ జాతీయ పార్టీలో చేరబోతున్నట్టు చెప్పారు. తనకు సినిమా చూపించిన ప్రతి ఒక్కరికీ త్రీడీ సినిమా చూపిస్తానని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయన్న శివాజీ.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌లు అడ్డగోలుగా పాలిస్తున్నారని విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతిని పక్కనపెట్టడంతో అక్కడ రియల్ ఎస్టేట్ కుదేలైందన్నారు.
కేసీఆర్, జగన్ కలవడంలో తప్పులేదని అయితే, ఇద్దరూ కలిసి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. గతంలో ఏపీ ప్రజలను రాక్షసులు అన్న కేసీఆర్ ఇప్పుడు ఏపీకి గోదావరి జలాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండడం వల్లే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. తాను కనుక బీజేపీలో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. తాను రెడ్లకు, రావులకు భయపడే రకం కాదని, తానెక్కడికీ పారిపోలేదని పేర్కొన్నారు. మీడియా ఇంకా ఎంతోకొంత బతికే ఉంది కాబట్టే తన వాదనను వినిపించగలుగుతున్నానని శివాజీ అన్నారు.