Doctor: కడుపు నొప్పి వస్తోందని వెళితే.. కండోములు రాసిచ్చిన వైద్యుడిపై ప్రభుత్వం సీరియస్!
- మందులకు బదులు కండోములు రాసిన వైద్యుడు
- కండోముల ఘటనపై అసెంబ్లీలో చర్చ
- వైద్యుడిపై విచారణ ప్రారంభం
కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యుడి వద్దకు వెళ్లిన మహిళకు కండోములను రాసిచ్చిన వైద్యుడిపై ప్రభుత్వం సీరియస్ అయింది. అతడిపై విచారణకు ఆదేశించింది.
జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్భంకు చెందిన క్లాస్ 4 గ్రేడ్ మహిళా ఉద్యోగిని ఒకరు కడుపు నొప్పితో బాధపడుతూ ఘాట్‌శిలా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన కాంట్రాక్ట్ వైద్యుడు అష్రాఫ్ బాదర్ మందులుగా కండోములు రాసిచ్చాడు. మందుల చీటీ తీసుకుని మెడికల్ షాపునకు వెళ్లిన మహిళ షాక్‌కు గురైంది. వైద్యుడు అందులో రాసినవి మందులు కావని, కండోములని షాపులోని వ్యక్తి చెప్పడంతో నిర్ఘాంతపోయింది. వెంటనే వెళ్లి వైద్యాధికారులకు ఫిర్యాదు చేసింది.
విషయం బయటకు రావడంతో వైద్యుడిపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జార్ఖండ్ ముక్తిమోర్చా సభ్యులు ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. మరోవైపు బాధిత మహిళ ఫిర్యాదుపై స్పందించిన వైద్యాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.