Jaipal Reddy: జైపాల్ రెడ్డి అంత్యక్రియలపై ప్రభుత్వం కీలక సూచన!

  • ఒంటి గంటలోపే అంత్యక్రియలు
  • గాంధీ భవన్ లో గంటపాటు పార్థివదేహం
  • ఆపై నక్లెస్ రోడ్ కు అంతిమయాత్ర

 కేంద్ర మాజీ మంత్రి, శనివారం అర్ధరాత్రి దివంగతుడైన సూదిని జైపాల్‌ రెడ్డి అంత్యక్రియల విషయంలో మార్పు జరిగింది. ఆయన అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరుగనుండగా, మధ్యాహ్నం ఒంటి గంటలోపు క్రతువును పూర్తి చేయాలని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం సూచించింది.

కాగా, జూబ్లీహిల్స్ లోని జైపాల్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా, గాంధీ భవన్ లో గంటపాటు ఆయన మృతదేహాన్ని ఉంచనున్నారు. తొలుత రెండు గంటల పాటు జైపాల్ పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం గాంధీ భవన్ లో ఉంచుతామని తెలిపినప్పటికీ, ఒంటిగంట లోపు అంత్యక్రియలు ముగించాలని ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు, గంట పాటే ఉంచనున్నట్టు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.

కాగా, జూబ్లీహిల్స్ నుంచి నాగార్జున సర్కిల్, లక్ డీ కపూల్, అసెంబ్లీ మీదుగా గాంధీ భవన్ చేరుకునే అంతిమయాత్ర, ఆపై అక్కడి నుంచి అసెంబ్లీ, రవీంద్రభారతి, సెక్రటేరియేట్ మీదుగా నక్లెస్ రోడ్ లోకి ప్రవేశించి, పీవీ ఘాట్ పక్కన సిద్ధం చేసిన ప్రాంతానికి చేరనుంది. అంతిమయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును, రూట్ క్లియరెన్స్ ను చేయనున్నారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ను దారిమళ్లిస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News