Karnataka: బలపరీక్షలో నెగ్గిన యడ్డీ... ముందున్న అసలు సమస్య!
- 106 ఓట్లు సాధించిన యడ్డీ
- మద్దతు పలికిన ఓ స్వతంత్ర సభ్యుడు
- ఉప ఎన్నికల్లో సత్తా చాటితేనే నిలబడనున్న సర్కారు
కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప సర్కార్ విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. 207 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ నిరూపణకు 104 మంది సభ్యులు అవసరం ఉండగా, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా 106 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఇండిపెండెంట్ కూడా మద్దతు పలకడంతో, మేజిక్ ఫిగర్ ను యడ్డీ సర్కారు అధిగమించింది. విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా 100 ఓట్లు వచ్చాయి.
కాగా, యడ్డీకి ముందున్న కాలం అంత సులువేమీ కాదని, అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో కనీసం 8 స్థానాల్లో విజయం సాధించకుంటే, ఆ ప్రభుత్వం తిరిగి పడిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ 17 స్థానాలూ కాంగ్రెస్, జేడీఎస్ సిట్టింగ్ స్థానాలని, ఈ ప్రాంతాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేదని గుర్తు చేస్తున్న విశ్లేషకులు, సగం స్థానాల్లో బీజేపీ గెలవకుంటే, ప్రభుత్వం తిరిగి మైనారిటీలో ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరిస్తున్నారు.