Andhra Pradesh: మహిళల భద్రత, సామాజిక ఉన్నతికి ప్రభుత్వ తోడ్పాటు మరింత అవసరం: ఏపీ గవర్నర్
- ప్రభుత్వ పథకాల గురించి గవర్నర్ కు వివరణ
- రెడ్ క్రాస్ పనితీరుపై గవర్నర్ పరిశీలన
- గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలసిన ఉప కులపతులు
మహిళల భద్రత, సామాజిక ఉన్నతికి సంబంధించి ప్రభుత్వపరమైన తోడ్పాటు మరింత అవసరమని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ఎన్జీవోల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాలలో చిన్నారులు, తల్లులకు మంచి పోషకాహారం అందించినప్పుడే ఆరోగ్యకరమైన భావి భారత పౌరులను ఈ దేశం చూడగలుగుతుందని పేర్కొన్నారు.
మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న విభిన్న కార్యక్రమాల గురించి గవర్నర్ తెలుసుకున్నారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, కమిషనర్ కృతిక శుక్లా తదితరులు ప్రభుత్వ పరంగా అమలవుతున్న వివిధ పథకాలను గురించి రాజ్ భవన్ లో గవర్నర్ కు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని, గవర్నర్ పలు సూచనలు చేస్తూ మహిళల భద్రత, ఇతర అంశాలకు సంబంధించి వారికి ఏక గవాక్ష విధానంలో సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. రానున్న రోజుల్లో వృద్ధుల సంక్షేమ గృహాలను సందర్శించేందుకు రావాలని గవర్నర్ కు అధికారులు విన్నవించగా అందుకు ఆయన అంగీకరించారు. గవర్నర్ సూచనల మేరకు తాము ముందడుగు వేస్తామని కృతికా శుక్లా పేర్కొన్నారు.
కాగా, గవర్నర్ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు కూడా ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రెడ్ క్రాస్ చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, అన్ని దానాలలోకి జీవితాలను కాపాడే రక్తదానం ఎంతో గొప్పదని, దానిని ప్రోత్సహించాలని సూచించారు. సేవా కార్యక్రమాలకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తారని, అయితే వారి దాతృత్వం సద్వినియోగం అవుతుందన్న భావనను కలిగించాల్సి ఉంటుందని వివరించారు. విపత్కర పరిస్థితులలో రెడ్ క్రాస్ సేవలను ఎలా అందించగలుగుతున్నారన్న దానిపై సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రేచల్ చటర్జీ, బాల సుబ్రహ్మణ్యం గవర్నర్ కు వివరించారు.
ఈ నేపథ్యంలో 1999 నాటి భారీ తుపానును గవర్నర్ ప్రస్తావించారు. ఒడిశాలో 14 జిల్లాలు ఆనాడు అతలాకుతలమయ్యాయని గుర్తు చేసుకున్నారు. గిరిజన ప్రాంతాలలో రెడ్ క్రాస్ ప్రత్యేక సేవలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం గవర్నర్ ను వివిధ విశ్వవిద్యాలయాల ఉప కులపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.