Andhra Pradesh: జగన్ వద్దన్నా ఆయనపై ఒత్తిడి తెచ్చి ఆ పథకం పేరు మార్చాం: ఏపీ మంత్రి బుగ్గన
- ఏపీలో త్వరలో అమలు కానున్న పథకం ‘అమ్మఒడి’
- జగన్ ఎంతో ఆలోచనతో ‘అమ్మఒడి’ని తెస్తున్నారు
- ఈ పథకం పేరును ‘జగనన్న అమ్మఒడి’గా మార్చాం
వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ‘అమ్మఒడి’ పథకంను ఏపీ ప్రభుత్వం త్వరలో అమలు చేయనుంది. తమ పిల్లలను బడికి పంపే ప్రతి ఒక్క తల్లికి ఈ పథకం ద్వారా ఏటా రూ.15,000 ఇవ్వనున్నారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ పథకం గురించి అసెంబ్లీలో ఈరోజు ప్రస్తావిస్తూ, ఎంతో ఆలోచనతో ‘అమ్మఒడి’ని వైఎస్ జగన్ ప్రవేశపెట్టనున్నారని అన్నారు.
జగన్ వద్దన్నా ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి ‘అమ్మఒడి’ పేరును ‘జగనన్న అమ్మఒడి’గా మార్చామని వివరించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలు భ్రష్టుపట్టిపోయాయని విమర్శించారు. చంద్రబాబు అండతోనే జన్మభూమి కమిటీలు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. శాంతిభద్రతల విషయంలో కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ స్వేచ్ఛను ఇచ్చారని, రాజకీయపార్టీలకు అతీతంగా తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారని చెప్పారు.