Andhra Pradesh: పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం చదువు: సీఎం జగన్
- పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ బిల్లు ఆమోదం
- పేదలకు చదువును దగ్గర చేసేందుకే ఈ కమిషన్
- చదువుకోవడం పిల్లల హక్కు
పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ బిల్లుకు ఏపీ శాసనసభలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈరోజు తీసుకువస్తున్న ఈ చట్టాన్ని ఓ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. చదువుకోవడం పిల్లల హక్కు అని, పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం చదువేనని అన్నారు. ప్రతి పేద వాడికి చదువును దగ్గర చేసేందుకే ఈ కమిషన్ తీసుకువస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎక్కడా అమలు కాలేదని, ఇష్టానుసారంగా ఫీజులు పెంచారని ఆరోపించారు. ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను నీరు గార్చారని విమర్శించారు.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చే దిశగా పేద, మధ్య తరగతి ప్రజలకు చదువును ఒక హక్కుగా ఇవ్వాలని అన్నారు. దేశంలో నిరక్షరాస్యత 26 శాతం ఉంటే, ఏపీలో 33 శాతం ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ బిల్లును తీసుకువచ్చామని చెప్పారు. ఈ కమిషన్ చెప్పిన మాట వినని పాఠశాలలను హెచ్చరిస్తుందని, ఆపై పెనాల్టీ విధిస్తుందని, అయినా మాట వినని పాఠశాలలను మూసివేసే అధికారాలు ఈ కమిషన్ కు ఉంటాయని వివరించారు.