Karnataka: ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు ఆత్మహత్య?
- ఉల్లాల్ బ్రిడ్జి పైనుంచి నేత్రావతి నదిలోకి దూకిన సిద్ధార్థ్
- సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఘటన
- మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు
దేశంలోని అతిపెద్ద కాఫీ చైన్ అయిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఆయన కనిపించడం లేదు. మంగళూరులోని ఉల్లాల్‌లో బ్రిడ్జిపై నుంచి ఆయన దూకేసి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నేత్రావతి నదిపై కిలోమీటరు పొడవున్న ఈ బ్రిడ్జిపై నుంచి రాత్రి 9 గంటల సమయంలో ఓ వ్యక్తి దూకినట్టు వార్తలు రావడంతో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షి అయిన కారు డ్రైవర్ ప్రకారం నదిలోకి దూకింది సిద్ధార్థగా తెలుస్తోంది. రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఉల్లాల్‌కు చేరుకున్న సిద్ధార్థ్ బ్రిడ్జి వద్దకు వెళ్లాల్సిందిగా డ్రైవర్‌ను కోరారు. కారు బ్రిడ్జి చివరికి చేరుకున్నాక కారును ఆపమని చెప్పి దిగారు. బ్రిడ్జిపై కొంతదూరం నడిచి ఆ తర్వాత అదృశ్యమయ్యారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.
90 నిమిషాలు వేచి చూసినా అతను తిరిగి రాకపోవడంతో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో వెంటనే బ్రిడ్జి వద్దకు చేరుకున్న మంగళూరు పోలీసులు సిద్ధార్థ కోసం గాలింపు మొదలుపెట్టారు. జిల్లా యంత్రాంగానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని గాలింపును పర్యవేక్షించారు. వరద కారణంగా నేత్రావతి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని పోలీసులు తెలిపారు.