Sony: బస్టాండులో సోనీని గుర్తించిన యువతి!
- తెల్లవారుజామున అద్దంకిలో వదిలెళ్లిన కిడ్నాపర్
- ఆపై హైదరాబాద్ కు చేరుకున్న సోనీ
- మౌని అనే మరో యువతి చొరవతో క్షేమం
హైదరాబాద్ లో తాను కిడ్నాప్ చేసిన సోనీని, నిన్న రాత్రి ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని నడిరోడ్డుపై విడిచిపెట్టిన రవిశేఖర్, అక్కడి నుంచి క్షణాల్లో మాయం కాగా, దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై ఉన్న సోనీ, బస్సులో హైదరాబాద్ ఎంజీబీఎస్ చేరుకోగా, మౌని అనే మరో యువతి ఆమెను గుర్తించి ఆదుకుంది. వారం రోజులుగా సరైన తిండి, నిద్ర, విశ్రాంతి లేని స్థితిలో, కళ్లు పీక్కుపోయి, బలహీనంగా కనిపిస్తున్న సోనీని చూసిన స్థానిక యువతి మౌని, ఆమె దగ్గరకు వచ్చి, గుర్తించి, పలకరించి, యోగక్షేమాలు అడిగింది.
మౌనీయే తన ఫోన్ ను సోనీకి ఇచ్చి, తండ్రికి, పోలీసులకు ఫోన్ చేయించింది. ఆమెను క్షేమంగా తండ్రికి, పోలీసులకు అప్పగించే వరకూ అక్కడే ఉంది. ఆపై మీడియాతో మాట్లాడిన మౌనీ, తాను ఎంజీబీఎస్, 70వ నంబర్ ప్లాట్ ఫామ్ వద్ద సోనీని గుర్తించానని తెలిపింది. వెళ్లి పలకరించానని, ఎక్కడికి వెళ్లావని అడిగితే, తిరుపతికి తీసుకెళ్లాడని, ఇంకా ఎక్కడ తిప్పాడో గుర్తు లేదని చెప్పినట్టు పేర్కొంది. ఆపై పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లారని, అప్పటివరకూ తాను సోనీకి తోడుగా ఉన్నానని చెప్పింది.