Madapur: మాదాపూర్‌లో ట్రాఫిక్ సీఐపై వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు పిడిగుద్దులు.. అరెస్ట్
- కారును ఆపడంతో రెచ్చిపోయిన ప్రసాద్
- సీఐతో వాగ్వివాదం
- చేయి చేసుకోవడంతో పోలీసుపై పిడిగుద్దులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కుమారుడు ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్పై దాడి చేశాడు. దీంతో ఆయనను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడైన సామినేని ప్రసాద్ మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్‌పై సోమవారం సాయంత్రం దాడిచేసినట్టు పోలీసులు తెలిపారు. రోడ్డు పనుల కారణంగా ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న సమయంలో మీనాక్షి టవర్స్ వద్ద ప్రసాద్ కారును పోలీసులు ఆపారు.
దీంతో కారు దిగిన ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. అది చూసి వెళ్లిన ట్రాఫిక్ సీఐ రాజగోపాల్ రెడ్డితోనూ ప్రసాద్ పౌరుషంగా మాట్లాడాడు. దీంతో సీఐ ఆయనపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో మరింత రెచ్చిపోయిన ప్రసాద్ సీఐపై పిడిగుద్దులు కురిపించాడు. సీఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.