BJP: మహారాష్ట్రలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. మండిపడ్డ శరద్ పవార్
- రేపు బీజేపీలో చేరనున్న ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- విపక్ష నేతలను బీజేపీ ఒత్తిడి చేస్తోందన్న శరద్ పవార్
- వారంతట వారే బీజేపీలో చేరుతున్నారన్న ఫడ్నవిస్
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతలపై వల విసురుతున్న బీజేపీ... తాజాగా మహారాష్ట్రలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలపై గురి ఎక్కుపెట్టింది. ఈ పార్టీల నేతలతో బీజేపీ చేసిన యత్నాలు ఫలించాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శివేంద్ర సింగ్ రాజే భోసాలే, వైభవ్ పిచాద్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే సందీప్ నాయక్ లు రేపు బీజేపీలో చేరనున్నారు. మరోవైపు, బీజేపీలో చేరేందుకు ఎన్సీపీకి చెందిన పలువురు నేతలు ఉత్సాహం చూపుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బీజేపీ తీరుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. విపక్ష పార్టీల నేతలను బీజేపీ ప్రలోభపెడుతోందని, ఒత్తిడి చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి (బీజేపీ) ఫడ్నవిస్ స్పందిస్తూ, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని చెప్పారు. ఈడీ లేదా ఇతర సంస్థలు దర్యాప్తు చేస్తున్న నేతలను మాత్రం పార్టీలో చేర్చుకోబోమని తెలిపారు. తాము ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని... వారంతట వారే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.