Godavari: గోదారమ్మ పరవళ్లు... గంటల వ్యవధిలో వేల నుంచి లక్షల క్యూసెక్కుల్లోకి పెరిగిన వరద!
- ధవళేశ్వరం వద్ద 10 అడుగుల మేరకు ప్రవాహం
- మధ్యాహ్నానికి మరింతగా పెరిగే అవకాశం
- 3.22 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో గంటల వ్యవధిలో వరద నీటి ఉద్ధృతి గణనీయంగా పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా లంక వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 10 అడుగుల నీటి ప్రవాహం కొనసాగుతుండగా, 3.22 లక్షల క్యూసెక్కుల నీరు బంగాళాఖాతంలోకి వదులుతున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద ప్రస్తుతం 26 అడుగుల మేర నీటిమట్టం ఉండగా, మధ్యాహ్నం తరువాత అది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.
వరద పెరిగితే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పోలవరంతో పాటు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం తదితర మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పంటపొలాల్లోకి నీరు చేరగా, వరద ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే పనులు ప్రారంభమయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా 16 గిరిజన గ్రామాలకు కరెంట్ ను నిలిపివేయగా, వారు తక్షణం తమకు కిరోసిన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.