Pawan Kalyan: సీఎం గారూ... భవన నిర్మాణ కార్మికుల బాధలు చూసి ఈ లేఖ రాస్తున్నా: పవన్ కల్యాణ్
- ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తామని తొలుత ప్రకటించిన పవన్
- భవన నిర్మాణ కార్మికుల వెతలు చూసి మనసు మార్చుకున్న జనసేనాని
- కూలీలు, కార్మికుల ఆకలి బాధలు ప్రభుత్వానికి ఏమంత క్షేమకరం కాదంటూ వ్యాఖ్యలు
ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇచ్చి, ఆ తర్వాత సమస్యలపై స్పందిస్తామని ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొన్ని గంటల్లోనే మనసు మార్చుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల బాధలు చూసిన తర్వాత సంయమనం పాటించలేకపోతున్నామని, అందుకే లేఖ రాస్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ పవన్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల నిర్మాణాలు కుంటుపడ్డాయని, భవన నిర్మాణ కార్మికులు పనిలేక పస్తులుంటున్నారని పవన్ తన లేఖలో పేర్కొన్నారు.
తనవద్దకు వచ్చిన కొందరు భవన నిర్మాణ కార్మికులు తమ బాధలు వ్యక్తపరిచి కన్నీటిపర్యంతమయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ప్రకటించడానికి ప్రభుత్వం సెప్టెంబరు 5 వరకు ఆగాల్సిన అవసరం ఏంటని పవన్ తన లేఖలో ప్రశ్నించారు. అప్పటివరకు కూలి పనులు చేసుకునేవాళ్లు ఏమైపోవాలంటూ నిలదీశారు. ఇలాంటి కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకలి బాధలు ప్రభుత్వానికి ఏమంత మంచిది కాదన్నారు.