MS Dhoni: ధోనీకి గార్డు డ్యూటీ విధించిన ఆర్మీ అధికారులు!
- పారాచూట్ రెజిమెంట్ లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ గా ఉన్న ధోనీ
- ఆటకు రెండు నెలలు దూరంగా ఉండాలని ధోనీ నిర్ణయం
- జమ్మూకశ్మీర్లో విధులకు హాజరు
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత విలక్షణమైన వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ తన రిటైర్మెంటు గురించి మాట్లాడుకుంటుంటే తాను మాత్రం దేశ సేవ కోసం కల్లోలభరిత కాశ్మీర్ లోయలో కాలుమోపాడు. ధోనీ ఆర్మీ అనుబంధ పారాచూట్ రెజిమెంట్ లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ అని తెలిసిందే. తన ఉద్యోగానికి న్యాయం చేసేందుకు ధోనీ రెండు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా, విధుల్లో చేరిన ధోనీకి ఆర్మీ అధికారులు గార్డు డ్యూటీ కేటాయించారు. పెట్రోలింగ్ విధులతో పాటు, అవుట్ పోస్టు డ్యూటీ కూడా ధోనీ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, 'విక్టర్ ఫోర్స్' కమెండోలతో కలిసి 15 రోజుల పాటు వివిధ రకాల పోరాట పంథాలపై శిక్షణ పొందనున్నాడు.