Andhra Pradesh: ఏపీలో కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లవనడం సబబు కాదు: కన్నా లక్ష్మీనారాయణ
- ఈ మేరకు సీఎం జగన్ కు ఓ లేఖ రాస్తాను
- సామాజిక స్థాయి ఆధారంగా కమిషన్ వేసి వర్గీకరణ చేసుకోవచ్చు
- ఈ మినహాయింపు కేంద్ర చట్టంలో ఉంది
కాపుల రిజర్వేషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీరును బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత సీఎం చంద్రబాబు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లవని చెప్పడం సబబు కాదని, ఈ మేరకు సీఎం జగన్ కు ఓ లేఖ రాయనున్నట్టు చెప్పారు.
సామాజిక స్థాయి ఆధారంగా కమిషన్ వేసి వర్గీకరణ చేసుకోవచ్చన్న మినహాయింపు కేంద్ర చట్టంలో ఉందని గుర్తుచేశారు. ఆర్థికంగా వెనుకబడిన పేదలకు కేంద్రం కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో ఈ వెసులుబాటు ఉందని అన్నారు. ఏపీలో కాపుల రిజర్వేషన్లకు సంబంధించి మంజునాథ కమిషన్ నివేదిక తర్వాతే అసెంబ్లీలో తీర్మానం చేసి ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.