Andhra Pradesh: ప్రజా సమస్యలపై అధ్యయనానికి యువ అభ్యర్థులతో కమిటీలు: పవన్ కల్యాణ్
- ప్యాక్ కి కమిటీల ఏర్పాటు బాధ్యతలు
- ఆగస్ట్ 7 నాటికి కమిటీల నియామకాలు పూర్తి
- మీకు టిక్కెట్లు ఇచ్చి నేను నిందలు పడ్డాను
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనానికి యువ అభ్యర్థులతో కమిటీలు రూపొందించనున్నట్టు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల పార్టీ తరఫున బరిలోకి దిగిన యువ అభ్యర్ధులతో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రతి అభ్యర్ధికి ఏ ఏ అంశాల మీద అవగాహన ఉంది అనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం యువ అభ్యర్థులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ, ప్రతి సమస్యపై ఓ కమిటీ వేస్తామని, ఆయా సమస్యల మీద అవగాహన ఉన్న వారికే బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఎవరికి కేటాయించిన సమస్యలపై వారు అధ్యయనం చేసి పార్టీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కో కమిటీలో మూడు నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారని, కమిటీల ఏర్పాటు బాధ్యత ‘ప్యాక్’ చూసుకుంటుందని అన్నారు.
ఆగస్ట్ 7వ తేదీ నాటికి ఈ కమిటీల నియామక ప్రక్రియ పూర్తవుతుందని, వ్యవసాయం, సహకార రంగం లాంటి అంశాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఆయా సమస్యలకు సంబంధించి పోరాటానికి తాను వెళ్లాల్సి వచ్చిన సందర్భాల్లో సదరు కమిటీలు ముందుగా ఆ ప్రాంతానికి వెళ్లి అధ్యయనం జరపాల్సి ఉంటుందని సూచించారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన సందర్భంలోనూ ఆయా కమిటీలు ముందుగా నివేదికలు రూపొందించాలని, కమిటీలలో ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు పోటీ చేయని వారు కూడా ఉంటారని, వారి పనితీరు ఆధారంగా ఈసారి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
బి.ఫారం ఇవ్వడం అంటే బాధ్యత ఇవ్వడం
నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు బి.ఫారం ఇవ్వడం అంటే బాధ్యత ఇవ్వడమేనని పవన్ కల్యాణ్ అన్నారు. యువ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చి వేరే పార్టీకి సహకరించానన్న నిందలు తాను మోయాల్సి వచ్చిందని అన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయని, ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే కొత్త వారికి అవకాశం ఇచ్చానని అన్నారు.‘మీలో ఎక్కువ మంది కొద్దిరోజుల ముందే పార్టీలోకి వచ్చారు. అందువల్లే ఓటమికి కారణాలపై నేను సమీక్షలు జరపడానికి ఇష్టపడలేదు. ఐదేళ్ల పాటు నాతో నడిచి ఓటమి పాలైతే ఎందుకు? ఏమిటి?’ అని సమీక్షలు జరపాలి. అయితే మీకు సీట్లు ఇచ్చిన కారణంగా బలంలేని అభ్యర్ధులకు సీట్లు ఇచ్చాను అన్న మాట పడాల్సి వచ్చింది. పార్టీ మీకు ఇచ్చిన గుర్తింపుకి ఆ మాట తీసేయాల్సిన బాధ్యత మీ భుజాలపై ఉంది’ అని పవన్ సూచించారు.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఒకరిని ఒకరు తిట్టుకోవడాలు, కొట్లాటలే కనబడుతున్నాయని, ప్రజా సమస్యలపై మాట్లాడే వారే కనబడడం లేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలని, అందుకు ఎక్కడో ఒక చోట అడుగు పడాలని అన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్ధులను తయారు చేయాలన్నదే తన లక్ష్యమని, ఒక నియోజకవర్గానికి ఒక నాయకత్వం సరిపోదని, పార్టీకి అంత మంది బలమైన బాధ్యత కలిగిన వ్యక్తులు కావాలని అన్నారు.
పార్టీ నిర్మాణంలో యువ అభ్యర్థులను భాగస్వాములను చేస్తాం: నాదెండ్ల
రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పార్టీ నిర్మాణంలో యువ అభ్యర్ధులను భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గత మూడు రోజులుగా అందుకు సంబంధించి సమావేశాలు జరుగుతున్నాయని, ఇన్‌ఛార్జ్‌ల నియామక ప్రక్రియ కూడా మొదలుపెట్టడం జరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు, చదువులు వదులుకొని ఇంట్లో పెద్దలు ఇష్టపడకపోయినా పవన్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పని చేసేందుకు వచ్చారని అన్నారు. అలాంటి వారందరినీ గుర్తించాలని, వాళ్లకి మరిన్ని బాధ్యతలు అప్పగించి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారని, అందుకోసం పార్టీ ఓ పొలిటికల్ క్యాలెండర్‌కి రూపకల్పన చేస్తున్నట్టు వివరించారు.