Amit Shah: తెలంగాణలో ఇంటింటికీ వెళ్లి 50 మందిని చేర్పించనున్న కమల దళపతి!
- తెలంగాణ నుంచి క్రియాశీల సభ్యత్వం తీసుకోనున్న షా
- 16-17 తేదీల్లో రాష్ట్రంలో పర్యటన
- 18 లక్షల మందిని పార్టీలో చేర్చాలని కమల నాథుల నిర్ణయం
గుజరాత్లో సాధారణ సభ్యత్వం కలిగిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణలో క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ సభ్యత్వం రావాలంటే కనీసం 50 మందిని పార్టీలో చేర్పించాల్సి ఉంటుంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగనున్న కమల దళపతి ఇంటింటికీ వెళ్లి 50 మందిని పార్టీలోకి చేర్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 16 కానీ లేదంటే 17న కానీ తెలంగాణకు రానున్నారు.
తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించిన బీజేపీ ఇందుకోసం సభ్యత్వాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల సభ్యత్వం ఉంది. దీనికి మరో 12 లక్షలు చేర్చి 30 లక్షలకు చేర్చాలని తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అది సరిపోదని, కనీసం మరో 18 లక్షల మందిని చేర్చాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు అమిత్ షా సూచించారు. ఈ సందర్భంగా తాను తెలంగాణ నుంచి క్రియాశీల సభ్యత్వం తీసుకోబోతున్నట్టు తెలిపారు. ఆ సభ్యత్వం కావాలంటే అమిత్ షా ఇంటింటికీ వెళ్లి 50 మందిని పార్టీలో చేర్పించాల్సి ఉంటుంది. అనంతరం వంద రూపాయలు చెల్లించి క్రియాశీల సభ్యత్వం తీసుకుంటారు. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో షా పర్యటించనున్నారు.