Devineni Uma: బందరు పోర్టును ఎంతకు అమ్ముకున్నారు? విజయసాయిరెడ్డీ, నీవా నన్ను బెదిరించేది?: దేవినేని ఉమ
- బందరు పోర్టు రహస్య జీవోలను బయటపెట్టండి
- నిమ్మగడ్డ అరెస్ట్ పై విజయసాయిరెడ్డి ఎందుకు ట్వీట్ చేయలేదు?
- ఎంపీలందరూ కలసి మోదీని ఏం అడుక్కున్నారు?
బందరు పోర్టును తెలంగాణకు ఎంతకు అమ్మేశారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ప్రభుత్వం మారగానే బందరు పోర్టులో పని చేస్తున్న యంత్రాలన్నీ వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడి నిర్మాణ సంస్థ వెళ్లిపోయిందని చెప్పారు. క్విడ్ ప్రోకో సంస్థకు బందరు పోర్టును జగన్ ప్రభుత్వం ఇచ్చేసిందని ఆరోపించారు. బందరు పోర్టుపై సీఎం జగన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పోర్టుకు సంబంధించిన రహస్య జీవోలను బహిర్గతం చేయాలని అన్నారు.
టీడీపీ నేతలపై పదేపదే ట్వీట్లు పెట్టే విజయసాయిరెడ్డి... సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ పై ఎందుకు ట్వీట్ చేయలేదని దేవినేని ఉమ ప్రశ్నించారు. 22 మంది వైసీపీ ఎంపీలు ప్రధాని మోదీని కలిసి ఏం అడుక్కున్నారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బెయిల్ పై తిరుగుతున్న విజయసాయి తమను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 'నీలాగా 16 నెలల జైలు జీవితం గడపలేదు, డబ్బు దోచుకోలేదు, క్విడ్ ప్రోకోలకు పాల్పడలేదు... నీవా నన్ను బెదిరించేది' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.