Andhra Pradesh: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు
- ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల
- ఈ నెల 26న పోలింగ్
- పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఏపీలో 3 స్థానాలకు, తెలంగాణలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
కాగా, ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి, తెలంగాణలో యాదవరెడ్డి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునే నిమిత్తం ఈ నోటిఫికేషన్ జారీ అయింది. గతంలో టీడీపీ నుంచి కరణం బలరాం, వైసీపీ నుంచి ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్ర స్వామి ఎమ్మెల్సీలుగా ఉండేవారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీరంతా ఎమ్మెల్యేలుగా గెలుపొండంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న యాదవరెడ్డి పార్టీ ఫిరాయించడంతో ఆయనపై వేటు పడింది. దీంతో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయా ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఏర్పడింది.