Congress: కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై తేల్చిచెప్పిన ప్రియాంక గాంధీ
- రాహుల్ గాంధీ తప్పుకోవడంతో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పెద్దలు
- ప్రియాంక బాధ్యతలు స్వీకరించాలంటూ విజ్ఞప్తులు
- తనకు ఆ స్థాయి లేదన్న గాంధీల వారసురాలు
ఎన్నికల్లో ఓటమి కంటే అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవడమే కాంగ్రెస్ పార్టీకి విచారకరమైన అంశంగా మారింది. ఎవరెంత చెప్పినా రాహుల్ ససేమిరా అంటుండడంతో ఇక చేసేదిలేక కాంగ్రెస్ అగ్రనేతలు ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారు. సోనియా గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని కొందరు సూచిస్తుండగా, మరికొందరు ప్రియాంక గాంధీ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రియాంక నాయకత్వం స్వీకరిస్తే పార్టీలో నవ్యోత్తేజం ఉప్పొంగుతుందని అంటున్నారు.
అయితే, ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు తాను స్వీకరించలేనంటూ ప్రియాంక నిర్మొహమాటంగా చెప్పేశారు. తనను ఈ వ్యవహారంలోకి దయచేసి లాగవద్దంటూ పార్టీ వర్గాలకు స్పష్టం చేశారు. ఓ జాతీయ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే స్థాయిలో తాను లేనని తేల్చిచెప్పారు. ఈ మేరకు జార్ఖండ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఆర్పీఎన్ సింగ్ చేసిన ప్రతిపాదనను ఆమె తోసిపుచ్చారు. ఇటీవలే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంక చేపట్టాలని కోరారు.