12 year chaild: అమ్మను కొడతాడు...నన్ను చదువుకోనివ్వడు: తండ్రిపై పన్నెండేళ్ల బాలుడి ఫిర్యాదు
- నిక్కరు, బనీన్‌తో నేరుగా పోలీస్ స్టేషన్‌కు
- ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లి సమస్యలు ఏకరవు
- తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
పసిపిల్లల మనసు తెల్లకాగితం వంటిది. దానిపై పడిన ముద్రలు అంతవేగంగా చెరిగిపోవు. వారికేం తెలుసులే అనుకుంటే ఒక్కోసారి మనం ఆశ్చర్యపోయేలా వ్యవహరిస్తారు. ఓ పన్నెండేళ్ల బాలుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రి తీరుపై ఫిర్యాదు చేయడం ఇందుకు ఉదాహరణ. తండ్రి తనను చదువుకోనివ్వడం లేదని, అమ్మను నిత్యం కొడుతున్నాడంటూ బాలుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. నిక్కరు, బనీనుతో స్టేషన్‌కు చేరుకున్న ఆ చిన్నారి నేరుగా ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లి తన సమస్యను ఏకరవు పెట్టాడు.
వివరాల్లోకి వెళితే...మహరాష్ట్రలోని జలగామ్ జిల్లా జమనేర్‌కు చెందిన అజయ్ (12) తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. తల్లి వ్యవసాయ కూలీ. అజయ్‌కి ఇద్దరు సోదరిలు. వారితో కలిసి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుకుంటున్నాడు. రోజూ పని నుంచి ఇంటికి వచ్చే తండ్రి రాత్రి చాలాసేపటి వరకు టీవీ చూస్తుండడం, తల్లిని ఎప్పటికప్పుడు కొడుతుండడంతో మనస్తాపానికి లోనయ్యాడు.
తన చదువుకు ఆటంకం కలగడం, తల్లి పడుతున్న వేదన భరించలేని చిన్నారి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తొలుత ఆశ్చర్యపోయిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాలుడికి చదువుపై ఉన్న శ్రద్ధను గుర్తించి అతని తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం అజయ్‌ని మార్కెట్‌కు తీసుకువెళ్లి దుస్తులు, చెప్పులు కొనిచ్చారు.