Manoharan: కోయంబత్తూర్ అత్యాచారం, హత్యల కేసు: ఉరిశిక్షను ఖరారు చేసిన సుప్రీం
- 2010లో తీవ్ర కలకలం రేపిన కేసు
- అక్కా, తమ్ముళ్లను తీసుకెళ్లి హత్య
- ఆపై పోలీసులపై కాల్పులు
- మద్రాస్ హైకోర్టు శిక్ష సరైనదేనన్న సుప్రీంకోర్టు
తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపిన చిన్నారిపై హత్యాచారం, ఆ పాప తమ్ముడి దారుణ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు మనోహరన్ కు గతంలో మద్రాసు హైకోర్టు రెండు ఉరిశిక్షలు, రెండు యావజ్జీవశిక్షలను విధించగా, అవి సరైనవేనని, ఇటువంటి వ్యక్తి సభ్య సమాజంలో ఉండేందుకు అర్హుడు కాదని, హైకోర్టు తీర్పునే ఖరారు చేస్తున్నామని వెల్లడించింది.
కేసు వివరాలను మరోసారి పరిశీలిస్తే, కోయంబత్తూరుకు చెందిన వస్త్రవ్యాపారి రంజిత్ కు ఐదో తరగతి చదువుతున్న ముస్కరన్ (10) అనే కుమార్తె, మూడో తరగతి చదువుతున్న రితిక్ (7) అనే కుమారుడు ఉన్నారు. 2010 అక్టోబర్ 29న అద్దెవ్యానులో డ్రైవర్ మోహన్ రాజ్, తన స్నేహితులైన మనోహరన్ సహకారంతో వీరిద్దరినీ కిడ్నాప్ చేసి పొల్లాచ్చి కొండల్లోకి తీసుకెళ్లారు. ముస్కరన్ పై దారుణ అత్యాచారానికి పాల్పడి, ఆపై వారిద్దరూ కలిసి చిన్నారులిద్దరినీ బీఏబీ వాగులోకి నెట్టేశారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. నిందితులను అరెస్ట్ చేసి, సాక్ష్యాలను పక్కాగా రూపొందించిన పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఆపై నిందితులను అదే సంవత్సరం నవంబర్ 9న విచారణ నిమిత్తం వ్యాన్ లో పోలీసులు తరలిస్తుండగా, వారి చేతుల్లోని తుపాకీలను లాక్కుని, కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆత్మరక్షణార్థం ఎదురుకాల్పులు జరపగా మోహన్ రాజ్ హతమయ్యాడు. మనోహరన్ జరిపిన కాల్పుల్లో ఎస్ఐలు ముత్తుమాలై, జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ కేసును తీవ్రంగా పరిగణించిన కోవై మహిళా కోర్టు, మనోహరన్ కు రెండు ఉరిశిక్షలు విధిస్తూ, తీర్పివ్వగా, దాన్నే మద్రాసు హైకోర్టు ఖరారు చేసింది. మనోహరన్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, తొలుత ఉరిశిక్షపై స్టే ఇచ్చిన ధర్మాసనం, విచారణ జరిపి, హైకోర్టు తీర్పునే ఖరారు చేసింది. ఇక మనోహరన్ కు మిగిలింది రాష్ట్రపతి కారుణ్య క్షమాభిక్ష మాత్రమే. రాష్ట్రపతి ఆ వినతిని నిరాకరిస్తే, ఉరిశిక్ష తప్పదు.