chandrayaan-2: చంద్రయాన్-2 కక్ష్యను మరోమారు పెంచిన ఇస్రో
- శుక్రవారం ఉపగ్రహంలోని ఇంజిన్లను మండించిన ఇస్రో
- 6న మరోమారు కక్ష్య పెంపు
- ఈ నెల 20 నాటికి చంద్రుడి కక్ష్యలోకి
గత నెల 22న భారత్ విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-2 ఉపగ్రహం కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు మరోమారు పెంచారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3.37 గంటల సమయంలో నాలుగో దశను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-2లోని ఇంజిన్లను పది నిమిషాలపాటు మండించి కక్ష్యను పెంచినట్టు తెలిపింది. ఈ నెల 6న మరోమారు ఉపగ్రహం కక్ష్యను పెంచుతామని పేర్కొంది.
ప్రస్తుతం ఈ ఉపగ్రహం నాలుగో భూ స్థిర కక్ష్యలో తిరుగుతోందని పేర్కొంది. ఈ నెల 20 నాటికి చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 6న మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 మధ్య చంద్రయాన్-2 ఐదో దశను పూర్తి చేసుకుంటుంది. అనంతరం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబరు ఏడో తేదీన చంద్రుడిపై చంద్రయాన్-2 అడుగిడుతుంది.