Jagan: జగన్ తీరుతో ఏపీలో నిర్మాణ రంగం కుదేలైంది: పురందేశ్వరి
- ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను ఇంకా మభ్యపెట్టొద్దు
- పనులు లేక కూలీలు కడుపు మాడ్చుకుంటున్నారు
- ప్రజల విశ్వాసం కోల్పోవద్దు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వానికి ఓ విధానమంటూ లేకపోవడం వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 90 శాతం స్టోన్ క్రషర్లు మూతపడ్డాయని అన్నారు. ఫలితంగా పనులు లేక కూలీలు కడుపు కాల్చుకునే పరిస్థితి తలెత్తిందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టంగా తేల్చి చెప్పినప్పటికీ జగన్ మాత్రం ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల విశ్వాసం కోల్పోయేలా అడుగులు వేయొద్దని హితవు పలికారు. పీపీఏల రద్దు సరికాదని, ఈ విషయంలో మరోమారు సమీక్షించుకోవాలని జగన్కు సూచించారు. రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.