Wahab Riaz: పాకిస్థాన్ జట్టులో రిటైర్మెంట్ల పరంపర.. టెస్టు క్రికెట్‌కు వాహబ్ గుడ్‌బై!
- ఇటీవల టెస్టుల నుంచి తప్పుకున్న ఆమిర్
- తన రిటైర్మెంట్పై ఇప్పటికే పీసీబీకి వాహబ్ సమాచారం
- గ్లోబల్ టీ20 టోర్నీ నుంచి రాగానే అధికారిక ప్రకటన
పాకిస్థాన్ క్రికెట్లో ఇప్పుడు రిటైర్మెంట్ల హవా నడుస్తోంది. ఆ జట్టు పేసర్ మహ్మద్ ఆమిర్ ఇటీవల టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి విమర్శల పాలయ్యాడు. 27 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం ఏంటంటూ మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోశారు. అక్తర్ అయితే ఓ స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు అతడి బాటలోనే మరో బౌలర్ వాహబ్ రియాజ్ నడుస్తున్నాడు.
34 ఏళ్ల వాహబ్ టెస్టుల నుంచి తప్పుకోబోతున్నట్టు ఆ దేశ మీడియా సంస్థ ‘దునియా న్యూస్’ పేర్కొంది. పాక్ క్రికెట్ బోర్డుకు రియాజ్ ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పినట్టు తెలిపింది. ప్రస్తుతం కెనడాలోని గ్లోబల్ టీ20 టోర్నీలో ఉన్న రియాజ్ స్వదేశానికి రాగానే తన రిటైర్మెంట్ను ప్రకటించనున్నట్టు పేర్కొంది. 27 టెస్టులు ఆడిన వాహబ్ 83 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్‌లో రియాబ్ 63 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతడి కెరియర్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు. చివరిసారి అక్టోబరు 2018లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు.