Nara Lokesh: తుగ్లక్ గారూ... ఉన్నారా? కేంద్ర మంత్రి చెప్పింది విన్నారా?: నారా లోకేశ్
- పోలవరంకు ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్కుంది
- కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి మీకే కనిపించిందా?
- రివర్స్ టెండరింగ్ అంటే పోలవరంకు టెండర్ పెట్టడమే
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'తుగ్లక్ గారూ.. ఉన్నారా? లోక్ సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఏం చెప్పారో విన్నారా? పోలవరం టెండర్లు రద్దు చేయడం బాధాకరం. మీ తుగ్లక్ చర్యల వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది. ఖర్చు కూడా పెరుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు' అని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో రూ. 2,600 కోట్ల అవినీతి జరిగిపోయిందంటూ తలతిక్క లెక్కలు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్కుందని చెప్పారు.
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జల సంఘం, కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన తర్వాతే నాబార్డ్ నిధులను విడుదల చేస్తుందని నారా లోకేశ్ తెలిపారు. కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు మాత్రమే కనిపించిందని ఎద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్ అంటే ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరానికి టెండర్ పెట్టడమనే విషయం అందరికీ అర్థమవుతోందని చెప్పారు.