Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రను ఆకస్మికంగా ఎందుకు నిలిపివేశారో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి: సీతారాం ఏచూరి డిమాండ్
- చర్చకు అవకాశం లేకుండానే 26 బిల్లులు ఆమోదించారు
- రాష్ట్రాల ప్రమేయం లేకుండానే ఎవరినైనా అరెస్ట్ చేసేలా చట్టాలను తీసుకొస్తోంది
- ఆటోమొబైల్ రంగంలో 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు
అమర్ నాథ్ యాత్రను ఉన్నట్టుండి ఎందుకు నిలిపివేశారో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి ఇదంతా చేస్తున్నారా? లేదా ఆర్టికల్ 35A ను రద్దు చేసే క్రమంలో ఇలా చేస్తున్నారా? అనే విషయంపై వివరణ ఇవ్వాలని చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చర్చకు అవకాశం లేకుండానే పార్లమెంటులో 26 బిల్లులను ఆమోదించారని... ఇది మంచి పద్ధతి కాదని ఏచూరి అన్నారు. రాష్ట్రాల ప్రమేయం లేకుండానే ఎవరినైనా అరెస్ట్ చేసేలా కేంద్రం కొత్త చట్టాలను తీసుకొస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమైన 8 రంగాల్లో గత ఐదేళ్లలో కేవలం 0.5 శాతం అభివృద్ధి మాత్రమే జరిగిందని విమర్శించారు. ఆటోమొబైల్ రంగంలో 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఇతర వామపక్షాలను కలుపుకుని పోరాటం చేస్తామని చెప్పారు.