USA: కుక్కకు భయపడి తుపాకీ తీసి, మహిళను బలిగొన్న యువ పోలీసాఫీసర్!
- అమెరికాలో విషాద ఘటన
- మహిళను కాపాడేందుకు వెళ్లిన పోలీసు
- కుక్కను కాల్చే క్రమంలో మహిళకు తగిలిన బుల్లెట్
అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తగా విధుల్లో చేరిన ఓ యువ పోలీసు అధికారి కుక్కకు భయపడి తుపాకీ తీసి, పొరపాటున ఓ మహిళను కాల్చేశాడు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న ఆ అధికారి ఆర్లింగ్టన్ ఏరియాలో పోస్టింగ్ అందుకున్నాడు. అయితే ఓ ఇంటి వద్ద అపస్మారక స్థితిలో మహిళ పడివుందన్న సమాచారం అందుకున్న ఆ పోలీసాఫీసర్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఆమె పేరు మార్గరిటా బ్రూక్స్. అప్పటికే కాస్త తేరుకున్న మార్గరిటాను పోలీసాఫీసర్ పరామర్శించాడు. తాను బాగానే ఉన్నానంటూ ఆమె జవాబిచ్చింది.
ఇంతలో ఆమె పెంపుడు కుక్క పోలీసు అధికారిని చూసి భీకరంగా అరవసాగింది. అది లాబ్రడార్ జాతికి చెందిన బలిష్టమైన కుక్క. అది ఎంతకీ మొరగడం ఆపకపోగా, పైకి దూకే ప్రయత్నం చేయడంతో ఆ యువ పోలీసు కంగారుపడి తుపాకీ తీసి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ప్రయత్నంలో బుల్లెట్ కాస్తా సదరు మహిళకే తగలడంతో ఆమె కుప్పకూలిపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. దాంతో ఆ అధికారి షాక్ తిన్నాడు.
తాను విధుల్లో భాగంగా తుపాకీ ఉపయోగించిన మొదటిసారే ఇలా జరగడంతో హతాశుడయ్యాడు. తాను ఏ మహిళను కాపాడ్డానికైతే వచ్చాడో, ఆమెను తానే చంపేయడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీనిపై శాఖాపరమైన విచారణకు తెరదీసిన ఆర్లింగ్టన్ పోలీసు విభాగం ఆ యువ పోలీసును సెలవుపై పంపి దర్యాప్తు ప్రారంభించింది.