Sujana Chowdary: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిదీ ఆందోళనకరంగా ఉంది: ప్రభుత్వ పాలనపై సుజనా అసంతృప్తి
- సుజనా చౌదరి మీడియా సమావేశం
- పోలవరం ప్రాజక్టు పనుల నిలిపివేతపై అభిప్రాయాలు వెల్లడించిన సుజనా
- సంప్రదింపుల ధోరణితో ముందుకెళ్లాలంటూ హితవు
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో ప్రభుత్వ పాలన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజక్టులు, ఇతర పథకాలు, పనులు ప్రతిదీ ఆగిపోయినట్టుగా తెలుస్తోందని, ఇది ఆందోళనకరమని అన్నారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికత నిబంధనపైనా కొందరు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ఇలాంటి నిబంధనల కారణంగా బ్యాంకర్లు కూడా ముందుకు రాని పరిస్థితి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారని సుజనా వివరించారు.
పోలవరం గురించి మాట్లాడుతూ ప్రాజక్టు పనులు ఆలస్యం అయ్యే కొద్దీ, రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రాజక్టు ఖర్చుల మదింపును పనులు ఆపేసి మరీ చేయాల్సిన అవసరంలేదని, కాగ్, ఆడిటింగ్ అనేవి ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ప్రాజక్టు ఆరంభం నుంచి రూ.15,000 కోట్లు ఖర్చు చేశారని, ఇప్పుడు పనులు ఆపేయడం వల్ల వడ్డీ నష్టం అని, రైతులకు నీళ్లు అందివ్వడం ఆలస్యమవుతుందని, ప్రభావిత గ్రామాల్లో పునరావాసానికి ఆటంకం ఏర్పడుతుందని వివరించారు. ఇలాంటప్పుడు సంప్రదింపుల ధోరణితో ముందుకెళితే నష్టాన్ని నివారించవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ఇక, పీపీఏల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ధోరణితో పెట్టుబడిదారులు పారిపోతున్నారంటూ ఎనర్జీ శాఖ మంత్రి కూడా అభిప్రాయపడ్డారని, కొత్త ప్రభుత్వం కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని, వేచి చూసే ధోరణితో ముందుకుపోవాలని సుజనా హితవు పలికారు. అయితే, ఏపీలో ఉన్నది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి అందరూ గౌరవించాలని, రాష్ట్రానికి నష్టం జరుగుతున్న నేపథ్యంలో ఓ ఎంపీగా తాను అన్నివిధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.