Godavari: ఇజ్రాయెల్ లో ఉన్న సీఎం జగన్ కు గోదావరి వరద ఉద్ధృతి వివరించిన అధికారులు
- గోదావరి ఉగ్రరూపం
- జలదిగ్బంధంలో 400కి పైగా గ్రామాలు
- సహాయ చర్యలపై అధికారులకు సూచనలిచ్చిన సీఎం జగన్
ఏపీ సీఎం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో అధికారులు ఆయనకు వివరాలు తెలియజేశారు. గోదావరి వరద ఉద్ధృతి గురించి సమాచారం అందుకున్న జగన్ అధికారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో తక్షణమే సహాయచర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి భోజన ఏర్పాట్లు కల్పించాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలకు బియ్యం సహా ఇతర నిత్యావసరాలు అందించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిత్యావసరాలు ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని జగన్ అధికారులకు తెలిపారు. గోదావరి వరద తీవ్రతపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న జగన్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు చెప్పారు.
కాగా, గోదావరి వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 400 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 9.27 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజి వద్ద 11.2 అడుగుల నీటిమట్టం ఉండగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.