Jammu And Kashmir: కశ్మీర్లో ఎటు చూసినా సైన్యం పహారా : 35వేల మంది జవాన్లు తరలింపు
- ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం
- కీలక ప్రాంతాల్లో మోహరించిన సైన్యం
- పూంచ్, రాజౌరీ సెక్టార్ల్లో రెడ్ అలర్ట్
ఏం సమాచారమో?...ఏం జరగబోతోందో?...దేనిపైనా స్పష్టతలేకున్నా, అంతా సాధారణ భద్రతా చర్యల్లో భాగమేనని ప్రభుత్వం చెబుతున్నా జమ్ము కశ్మీర్ రాష్ట్రం భద్రతా బలగాలతో నిండిపోయింది. ముఖ్యంగా పూంచ్, రాజౌరీ సెక్టార్లలో అడుగుకో సైనికుడు దర్శనమిస్తున్నాడు. ముందు జాగ్రత్తగా కేంద్రం పంపించిన 35వేల అదనపు బలగాలు రాష్ట్రంలో మోహరించాయి. ఇప్పటికే అమర్నాథ్ యాత్ర నిలిచిపోయింది. మచేల్ యాత్రను కూడా రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జవాన్ల సెలవులు రద్దయ్యాయి. ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగవచ్చన్న ఐబీ హెచ్చరిక నేపథ్యంలో సైన్యం డేగకన్నుతో పహారా కాస్తోంది.
భారీగా భద్రతా బలగాల మోహరింపుతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, నిత్యావసరాలు సమకూర్చుకునేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు గవర్నర్ సత్యపాల్మాలిక్ తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, రాజకీయ నాయకులు సమన్వయం పాటించాలని కోరారు.