mahendra singh dhoni: కష్టాలను కోరి ఆహ్వానించిన ధోనీ...సైనిక విధుల్లో క్షణక్షణం
- హోదా పక్కనపెట్టి సాధారణ విధులకు సిద్ధం
- జమ్ముకశ్మీర్ సైనిక విధుల్లో క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ
- పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్నా తొణకని వ్యక్తిత్వం
కూర్చుంటే తరగనంత సంపద ఉంది...సెలెబ్రిటీగా అంతులేని ఆదరణ...హాయిగా కాలుమీద కాలేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నా దేశంకోసం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అంటూ సైనిక విధులు నిర్వహిస్తున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్ కమ్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ. క్రికెట్ జట్టు సభ్యుడిగా కీలక సమయంలో ఆదుకునే ధోనీ అదే చిత్తశుద్ధి, దేశభక్తి సైనిక విధుల్లోనూ చూపిస్తూ అధికారులనే ఆకర్షిస్తున్నారు. ధోనీ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా చేరిన విషయం తెలిసిందే. ఇది గౌరవహోదా. ఈ హోదా ఉన్న వారికి రెగ్యులర్ విధులు అప్పగించరు. కానీ కొన్ని నెలల క్రితం ధోనీ సైనికాధికారులకు లేఖరాస్తూ తనకు సాధారణ విధులు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనకు సైనికాధికారులు జమ్ముకశ్మీర్‌లో సాధారణ విధులు అప్పగించారు.
ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ధోనీ నిర్భయంగా తన విధులు కొనసాగిస్తున్నారు. సాధారణ సైనికుల మాదిరిగానే బ్యారక్‌ల్లో ఉంటూ గస్తీ విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి సాధారణ సైనికులతోపాటే అన్ని విధుల్లో పాల్గొంటూ ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం 106 టీఏ పారా బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న ధోనీ ఆగస్టు 15 వరకు అందులో కొనసాగుతారు.
ఈలోగా గ్రామాల్లో పెట్రోలింగ్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. కానీ ఇక్కడే చిక్కుంది. కశ్మీర్ అడవుల్లో అక్కడక్కడా విసిరేసినట్లుండే గ్రామాల్లో ఉగ్రవాదులు తోడేళ్లలా నక్కిఉంటారు. భారీ కాన్వాయ్‌తో వెళ్లే సైనికులపై దాడులు చేసిన సందర్భాలు ఎన్నో. ఇవన్నీ ధోనికి సవాల్ విసిరే అంశాలే. కానీ రేపు బతుకుతామో? లేదో? తెలియని పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు తానూ అదే పరిస్థితులు ఎదుర్కొంటూ ధోనీ ఇస్తున్న స్ఫూర్తి ఎంతో ఉపయుక్తమంటే అతిశయోక్తి కాదు.