Jammu And Kashmir: కశ్మీర్ మాజీ సీఎంలను అర్ధరాత్రి గృహ నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు
- ఆదివారం అర్ధ రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
- గృహ నిర్బంధంలో మెహబూబా, ఒమర్ అబ్దుల్లా
- నేటి నుంచి విద్యాసంస్థలు బంద్
జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. అక్కడేం జరుగుతోందన్న ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువవుతోంది. కేంద్ర బలగాల మోహరింపు సహా జరుగుతున్న పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో నేడు ఏదో జరగబోతోందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.
తమను అదుపులోకి తీసుకోవడంపై మాజీ సీఎంలు ట్వీట్ చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఒమర్ అబ్దుల్లా పిలుపునివ్వగా, సోమవారం ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలని మెహబూబా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామిలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నా పోలీసులు ధ్రువీకరించలేదు. కాగా, నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి.