kuldeep singh sengar: ఆమె త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా.. ఉన్నావో రేప్ కేసు నిందితుడు కుల్దీప్ సింగ్

  • నేడు కుల్దీప్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
  • తనపై రాజకీయ కుట్ర జరుగుతోందన్న ఎమ్మెల్యే
  • బహిష్కరించినా బీజేపీకి విధేయుడినేనన్న సెంగార్

ఉన్నావో అత్యాచార బాధితురాలు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ పేర్కొన్నారు. కుల్దీప్‌తోపాటు ఈ కేసులో సహ నిందితుడైన శశిసింగ్‌ను నేడు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సీతాపూర్ జైలులో ఉన్న వీరిని ఆదివారం ఢిల్లీకి తరలించారు. ఈ సందర్భంగా కుల్దీప్ మాట్లాడుతూ.. తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ తాను మాత్రం బీజేపీ కార్యకర్తనేనని స్పష్టం చేశారు.

ఉద్యోగం ఇప్పించాల్సిందిగా కోరుతూ తన ఇంటికి వచ్చిన బాధిత యువతిపై 2017లో ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి చనిపోవడం, ఇటీవల ఆమె ప్రయాణిస్తున్న కారును నంబరు ప్లేటు లేని లారీ ఢీకొనడం వంటి ఘటనలు ఎమ్మెల్యేపై అనుమానాలు మరింత పెంచేలా చేశాయి. ఈ ప్రమాదంలో బాధిత యువతి  పిన్ని, అత్త మరణించారు. బాధితురాలు, ఆమె లాయర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.  

  • Loading...

More Telugu News