Andhra Pradesh: రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ లతో భేటీ!
- విభజన హామీలపై కేంద్రానికి నివేదిక
- కీలక ప్రాజెక్టులను పూర్తిచేయడంపై చర్చ
- రెండ్రోజుల పాటు సాగనున్న పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న జగన్.. ఏపీ విభజన హామీలకు సంబంధించి కేంద్రం చేయాల్సిన సాయంపై నివేదిక అందించనున్నారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్, ఇతర కేంద్ర మంత్రులతో జగన్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఏపీలోని కీలక ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేయడంపై వారితో చర్చించనున్నారు.
మరోవైపు ఢిల్లీ టూర్ లో భాగంగా పోలవరం టెండర్ల రద్దు, విద్యుత్ పీపీఏలను రద్దుచేయడంపై జగన్ ప్రధాని మోదీకి వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏపీ హక్కుల విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వైసీపీ పార్లమెంటు సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రెండ్రోజుల పర్యటనను ముగించుకున్నాక జగన్ విజయవాడకు తిరుగుప్రయాణమవుతారు.