Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ ను రెండుగా చీల్చిన కేంద్ర ప్రభుత్వం!
- జమ్ముకశ్మీర్, లడఖ్ లుగా విడిపోయిన కశ్మీరం
- అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్
- అసెంబ్లీ ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్
భారతదేశ చరిత్రలో ఈరోజు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు భాగాలుగా విడగొట్టింది. జమ్ముకశ్మీర్, లడఖ్ లుగా విభజించింది. లడఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. జమ్ముకశ్మీర్ ను అసెంబ్లీ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది. ఇరు ప్రాంతాలకు వేర్వేరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
జమ్ముకశ్మీర్ కు ఇప్పటివరకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన క్షణాల వ్యవధిలోనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోవడం గమనార్హం. ముందస్తు పక్కా వ్యూహంతో పార్లమెంటులో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. మరోవైపు, జమ్ముకశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున భద్రతాబలగాలను మోహరింపజేశారు.