Jammu And Kashmir: ముగిసిన కశ్మీర్ జెండా ప్రస్థానం.. ఆర్టికల్ 370 రద్దుతో ఇక మిగతా రాష్ట్రాల్లాగే!

  • 1952లో అధికారిక జెండాగా ఎంపిక
  • జాతీయ పతాకంతో పాటు ఎగరవేసే అధికారం
  • ఆర్టికల్ 370 రద్దుతో మారిన పరిస్థితి

భారతదేశంలో త్రివర్ణ పతాకంతో పాటు అధికారికంగా జెండాను ఎగరవేసే హక్కు ఉన్న ఏకైక రాష్ట్రం జమ్మూకశ్మీర్ మాత్రమే. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా జాతీయ పతాకంతో పాటు కశ్మీర్ జెండాను ఎగరవేస్తారు. ఎరుపురంగులో మూడు గీతలు, ఓ నాగలితో ఈ జెండాను రూపొందించారు. ఇందులో ఎరుపు రంగును త్యాగానికి, మూడు గీతలను మూడు మతాలకు(ముస్లింలు-బౌద్ధులు-హిందువులు) ప్రతీకగా రూపొందించారు.

కశ్మీర్ లో డోగ్రా రాజుల పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన రాజకీయ ఉద్యమంలో ఈ జెండా పురుడు పోసుకుంది. 1931, జూలై 13న శ్రీనగర్ సెంట్రల్ జైలు వద్ద ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరపడంతో 21 మంది చనిపోయారు. ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి రక్తంతో తడిసిన తన చొక్కాను ఎరగవేశాడని స్థానికులు చెబుతారు. ఈ రోజును జమ్మూకశ్మీర్ లో మృతవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. దీంతో ఈ జెండాకు తుదిరూపునిచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తమ పార్టీ జెెండాగా మార్చుకుంది. 1952, జూన్ 7న అసెంబ్లీ దీన్ని రాష్ట్ర జెండాగా ఆమోదించింది.

అదే ఏడాది రాష్ట్ర అధికారాలను నిర్వచించే ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, జమ్మూకశ్మీర్ ప్రధాని షేక్ అబ్దుల్లాలు సంతకాలు చేశారు. జమ్మూకశ్మీర్ జెండా విషయంలో కూడా ఒక ఒప్పందం జరిగింది. త్రివర్ణ పతాకం జాతీయ జెండాగా ఉంటే, ఇది రాష్ట్ర జెండాగా ఉంటుందని అంగీకారం కుదిరింది. రెండు జెండాలను ఎగరేసే అధికారం కూడా రాష్ట్రానికి దక్కింది.

భారత్‌లోని ఇతర ప్రదేశాల్లో జాతీయ జెండాకు ఎలాంటి స్థాయి ఉంటుందో జమ్మూకశ్మీర్‌లోనూ అలానే ఉంటుంది. అయితే, జమ్మూకశ్మీర్ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన చారిత్రక కారణాల దృష్ట్యా రాష్ట్ర జెండాకు కూడా గుర్తింపు ఉంటుంది. ఈ జెండాను ఎవరు రూపొందించారన్న విషయమై స్పష్టత లేనప్పటికీ కళాకారుల కుటుంబానికి చెందిన మోహన్ రైనా అనే వ్యక్తి రూపొందించినట్లు చాలామంది చెబుతారు.

  • Loading...

More Telugu News