police boss: ఖాకీవనంలో కర్షకుడు...సెలవురోజున పొలంలోనే పోలీస్ బాస్
- వ్యవసాయం అంటే మక్కువ అంటున్న ఏఎస్పీ రామనరసింహారెడ్డి
- తాను అధికారిని అయ్యేందుకు సాయపడిందని కృతజ్ఞత
- మక్కువ పెంచుకుంటే సాగు సులభమేనని సూచన
నగర జీవితానికి అలవాటు పడితే బురదలో కాలేయాలంటేనే ఇబ్బంది అనిపిస్తుంది. ఇక పొలంలోకి దిగి వ్యవసాయ పనులు చేయాలంటే? అంత ఈజీనా అంటే అదేం కాదంటారు ఆయన. మక్కువ పెంచుకుంటే వ్యవసాయం అంత ఈజీ మరొకటి లేదని చెబుతారు హైదరాబాద్ సీఐడీ విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న కటంగూరి రామనరసింహారెడ్డి. ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలాపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లి. పోలీసు అధికారిగా వ్యవసాయం చేయాల్సిన అవసరం ఆయనకు ఎంతమాత్రం లేదు. కానీ తానీరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది నేలతల్లి దయేనని ఆయన వినమ్రంగా చెబుతారు. అందుకే తనకు వ్యవసాయం అంటే మక్కువ అంటారు.
దాదాపు 32 ఏళ్ల క్రితం ఎస్‌ఐగా పోలీసు ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఏఎస్పీ స్థాయికి ఎదిగినా వారానికి ఓరోజు వ్యవసాయం చేయడానికి సమయాన్ని కేటాయిస్తారు. ఈ ఆదివారం కూడా అలాగే స్వగ్రామానికి వచ్చారు. ఉదయాన్నే కాడెడ్లకు నాగలికట్టి పొలంబాటపట్టి, గొర్రు తోలారు. నారుమోసి కూలీలతో కలిసి నాట్లు వేశారు.
అంతేకాదు కేఎస్‌ఆర్ ట్రస్టు, ఆర్‌ఎన్‌ఆర్ సేవాదళ్ వ్యవస్థాపకునిగా సోదరుడు కటంగూరి శ్రీరాంరెడ్డితో కలిసి రైతులకు పలురూపాల్లో సేవలందిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మూడు బస్సులలో రైతులను తీసుకువెళ్లి చూపించారు.