Jammu And Kashmir: అమిత్ షా నిర్ణయం నెత్తిన బాంబు వేసినట్టు అనిపించింది: కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్
- కశ్మీరీల మనోభావాలను పట్టించుకోలేదు
- అంతా చేశాక చర్చ జరపడంలో అర్థమే లేదు
- రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆజాద్ వ్యాఖ్యలు
ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ నిప్పులు చెరిగారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కశ్మీర్ విభజన అనే దాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయం నెత్తిన బాంబు వేసినట్టు అనిపించింది. అమిత్ షా నిర్ణయంతో కశ్మీర్ పై అణుబాంబు వేశారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కశ్మీరీల మనోభావాలతో సంబంధం లేకుండా ఇదంతా చేశారని, అంతా చేశాక చర్చ జరపడంలో అర్థమే లేదని విమర్శించారు. ఎన్నికల కోసం విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీపై మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లోనూ అగ్రకులాల్లో పేదలు ఉన్నారని, అధికరణ 370 రద్దు చేసి కశ్మీర్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పారామిలిటరీ బలగాలను కశ్మీర్ కు పెద్ద సంఖ్యలో తరలించారని, అమర్ నాథ్ యాత్రికులను భయపెట్టి వెనక్కి పంపించారని, పోలీస్, వైద్య తదితర శాఖల్లో పని చేసే వారి సెలవులు రద్దు చేశారని అన్నారు. కేంద్ర విద్యా సంస్థలను మూసివేసి వాళ్లను ఎక్కడికి పంపారని ఆజాద్ విమర్శించారు.