KIA: చంద్రబాబు హయాంలో ట్రయల్ రన్... జగన్ సమక్షంలో లాంచింగ్!
- మార్కెట్లోకి వస్తున్న కియా కొత్త కారు సెల్టోస్
- ఆగస్టు 8న లాంచింగ్
- అనంతపురం జిల్లా పెనుకొండ యూనిట్ లో తయారీ
ఏపీలో తయారీ యూనిట్ స్థాపించిన అంతర్జాతీయ కార్ల దిగ్గజం కియా ఆగస్టు 8న తన కొత్త కారును మార్కెట్లో ప్రవేశపెడుతోంది. సెల్టోస్ పేరుతో రూపుదిద్దుకున్న ఈ ఎస్ యూవీకి ఇప్పటికే భారీగా ఆర్డర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. తొలి కారు ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా కియా మోటార్స్ ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
గత ప్రభుత్వ హయాంలో కియా మోటార్స్ ప్లాంట్ ఏర్పాటైంది. అనంతపురం జిల్లా పెనుకొండలో సుమారు రూ.13,500 కోట్ల పెట్టుబడితో భారీ యూనిట్ ను నిర్మించారు. గతేడాది అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలో కియా కారు ట్రయల్ రన్ నిర్వహించగా, అందులో చంద్రబాబు కూడా షికారు చేశారు. ఇప్పుడు అదే కారును సీఎం హోదాలో జగన్ మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో కియా ఎండీ కూక్ హ్యున్ షిమ్, సీఏఓ థామస్ కిమ్ జగన్ నివాసానికి వచ్చారు. జగన్ కు ఆహ్వానపత్రం అందించారు. సీఎం జగన్ తో కియా ప్రతినిధులు మాట్లాడుతూ, పెనుకొండ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా ఏటా 3 లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యం ఉందని, మున్ముందు ఆ సామర్థ్యాన్ని 7 లక్షలకు పెంచుకుంటామని తెలిపారు.