Kapil Sibal: సర్దార్ వల్లభాయ్ పటేల్ కశ్మీర్ ను పాక్ కు ఇచ్చేసేందుకు మొగ్గు చూపారు: కపిల్ సిబాల్
- ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా రాజ్యసభలో తీవ్ర చర్చ
- జునాగఢ్ సంస్థానాన్ని భారత్ లో కలిపేందుకు పటేల్ ఇష్టపడ్డారంటూ సిబాల్ వెల్లడి
- నెహ్రూ చొరవతోనే కశ్మీర్ భారత్ లో భాగమైందంటూ వ్యాఖ్యలు
ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా రాజ్యసభలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ మాట్లాడుతూ, దేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కశ్మీర్ ను పాకిస్థాన్ కు వదిలేయడానికి మొగ్గుచూపారని వెల్లడించారు.
"అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్టికల్ 370ని సభలో ప్రవేశపెట్టగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కశ్మీర్ ను పాక్ పరం చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. జునాగఢ్ సంస్థానాన్ని భారత్ లో కలిపేసేందుకు మాత్రం పట్టుదల చూపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జునాగఢ్ రాజు ఓ ముస్లిం, దాంతో ఆయన పాకిస్థాన్ లో తన సంస్థానం కలవాలని కోరుకున్నాడు. ఇక కశ్మీర్ పాలకుడు ఓ హిందూ, దాంతో సహజంగానే ఆయన భారత్ పక్షానికి రావాలనుకున్నాడు. జవహర్ లాల్ నెహ్రూ చొరవ కారణంగానే కశ్మీర్ భారత్ లో భాగమైంది" అంటూ వివరణ ఇచ్చారు.